రాయలసీమ న్యూస్, అన్నమయ్య: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లెలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ AIYF నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
తరువాత తమ డిమాండ్లను వివరించిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు AIYF ప్రతినిధుల బృందం అందజేసింది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించినట్లు AIYF నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా AIYF జిల్లా అధ్యక్షుడు విజయన్, జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలోని BJP ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను విస్మరించిందని ఆరోపించారు. యువత ఆశలు, ఆకాంక్షలను పక్కనబెట్టి కేంద్రం వ్యవహరిస్తోందని వారు అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వారికి నెలకు రూ.10 వేల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చి, అనంతరం మాట మార్చిందని వారు విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేసి నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం అరకొరగా పోస్టులను భర్తీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని AIYF నాయకులు పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని, నిరుద్యోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ధర్నాలో AIYF నాయకులతో పాటు అనేక మంది నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని AIYF నాయకులు హెచ్చరించినట్లు సమాచారం.













