కడప జిల్లా వీరబల్లి మండలంలో అప్పు వివాదం ప్రాణం తీసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దివీడు పెద్ద ఎస్టీ కాలనీకి చెందిన చిన్న వెంకటరమణ (50)ను అదే గ్రామానికి చెందిన సంజీవ, నారాయణమ్మలు కొట్టడంతో ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల, గ్రామస్థుల సమాచారం ప్రకారం చిన్న వెంకటరమణ కొంతకాలం క్రితం అవసరాల నిమిత్తం సంజీవ, నారాయణమ్మల వద్ద నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. పలుమార్లు అడిగినా ఆ అప్పు తిరిగి చెల్లించలేదని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పేర్కొన్నారు.

శుక్రవారం మాతమ్మ ఆలయ నిర్మాణం వద్దకు వచ్చిన చిన్న వెంకటరమణను సంజీవ, నారాయణమ్మలు కలిసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆగ్రహానికి లోనైన సంజీవ, నారాయణమ్మలు చిన్న వెంకటరమణను కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్న వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. వెంటనే గ్రామస్థులు 108 ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు విధుల్లో ఉన్న వైద్యులు నిర్ధారించారు.

ఘటన సమాచారం అందుకున్న ఏఎస్పీ మనోజ్ రాంనాథ్ హెగ్డే, సీఐ సురేశ్ రెడ్డి, ఎస్‌ఐ సుస్మిత పెద్ద ఎస్టీ కాలనీకి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం సమీప గృహాల వారిని, గ్రామస్థులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.

సంజీవ, నారాయణమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాతమ్మ ఆలయ నిర్మాణం వద్ద జరిగిన ఈ దాడి గ్రామంలో కలకలం రేపింది.

చిన్న వెంకటరమణ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. ఆలయం వద్దకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆయన మృతదేహంగా తిరిగి రావడం కుటుంబాన్ని, గ్రామస్థులను కలచివేసింది. ఒక్కసారిగా ఆదరణ కోల్పోయిన కుటుంబం భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.