రాయలసీమ న్యూస్, అన్నమయ్య: కడప జిల్లా రాజంపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఒప్పంద పద్ధతిపై పనిచేస్తూ చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 10 నుంచి ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు, గత నెల 30న కేసు నమోదు చేసి గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఈ విషయం శుక్రవారం ఆలస్యంగా బయటకు వచ్చింది.
రాజంపేట మండలం ఎర్రబల్లికి చెందిన నాగేంద్ర, అతని భార్య విజయలక్ష్మిలపై చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేశారనే ఆరోపణలపై గత నెల 30న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే ఏఎస్పీ, సీఐలు ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పిన 13 మంది బాధితులు సుమారు రూ.1.35 కోట్ల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులకు అందజేశారు.
ఈ పత్రాల ఆధారంగా నాగేంద్ర దంపతులకు చెందిన ఆస్తుల వివరాలు సేకరించిన పోలీసులు, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే చాలా మంది బాధితులు సరైన పత్రాలు అందించలేదని, అందువల్ల విచారణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కువైట్, ఇతర దేశాల్లో స్థిరపడిన పలువురు వ్యక్తులు నాగేంద్రకు అప్పుగా డబ్బులు ఇచ్చినట్టు చెబుతున్నప్పటికీ, తమ వద్ద ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినట్టు పోలీసులు వెల్లడించారు.
నాగేంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, భూముల కొనుగోలు, విక్రయాలు, వాహనాల కొనుగోలు వంటి అంశాలను వెలికితీయడానికి పట్టణ పోలీసులు ప్రత్యేక విచారణ ప్రారంభించారు. జిల్లా ఉన్నతాధికారుల అనుమతితో వివిధ శాఖల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. రెవెన్యూ, బ్యాంకులు, ఇతర శాఖల నుంచి వచ్చే వివరాల ఆధారంగా కేసు విచారణను మరింత లోతుగా కొనసాగించనున్నట్టు తెలిపారు.
ప్రాథమిక విచారణ పూర్తయిన నేపథ్యంలో, కేసు తదుపరి దశలో డీఎస్పీ పరిధిలో విచారణ సాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రారంభ దశలో బాధితులు సరైన పత్రాలు అందించకపోవడం, వడ్డీలకు నాగేంద్ర రాసి ఇచ్చిన చెక్కులు, బాండ్లు మాత్రమే ఉండటం, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వలేకపోవడం విచారణకు ఆటంకంగా మారిందని చెప్పారు.
ప్రస్తుతం నాగేంద్ర, అతని భార్య విజయలక్ష్మిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు రాజంపేట పట్టణ సీఐ నాగరాజు తెలిపారు. కేసు పురోగతిపై జిల్లా ఉన్నతాధికారులకు తరచూ నివేదికలు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.













