రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాజంపేట : రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), రోబోటిక్స్ ల్యాబ్‌ను వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చేరుకూరి, రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గురువారం ఘనంగా ప్రారంభించారు. ల్యాబ్ ప్రారంభోత్సవం అనంతరం దానికి సంబంధించిన బ్రోషర్లను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చేరుకూరి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశ నుంచే శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. తాము చదువుకున్న పాఠాలను కేవలం మార్కుల కోసమే కాకుండా, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా మార్చుకోవడమే గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ రాజంపేట ప్రాంత విద్యార్థులు ఈ ఆధునిక ల్యాబ్ ద్వారా ఏఐ, రోబోటిక్స్ అంశాలలో పూర్తి పరిజ్ఞానం సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సాంకేతిక రంగంలో వచ్చే మార్పులను అందిపుచ్చుకుంటూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన విద్యార్థులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి అత్యాధునిక వసతులు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, సైన్స్ సిటీ ఆంధ్రప్రదేశ్ సీఈఓ వెంకటేశ్వర్లు కేశినేని, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి, డాక్టర్ నవీన్ కుమార్ మరియు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.













