రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి: కేంద్రంలోని BJP ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న న్యూ ఢిల్లీ లోని రాంలీలా మైదాన్ లో జరగనున్న "బద్లావ్ జరూరీ హై–మార్పు కావాలి" మహార్యాలీని విజయవంతం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (CPI) జిల్లా కార్యదర్శి పి. మహేష్ పిలుపునిచ్చారు.
రాయచోటి పట్టణంలోని CPI కార్యాలయంలో నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహార్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు, నియోజకవర్గ స్థాయి మొబిలైజేషన్‌పై చర్చించారు.
ఈ సందర్భంగా పి. మహేష్ మాట్లాడుతూ దేశ ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అవసరమైన వస్తువుల ధరల పెరుగుదలను వెంటనే అరికట్టాలని కోరారు.
సార్వత్రిక విద్య, వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధరను కల్పించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
ఎన్నికల వ్యవస్థలో మార్పుల అవసరాన్ని సూచిస్తూ బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు దళితులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్ 1న జరగనున్న "చలో ఢిల్లీ" నిరసన కార్యక్రమానికి రాయచోటి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్మికులు, పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగులు, సాధారణ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మర్రి సుమిత్ర, CPI పట్టణ కార్యదర్శి చుక్క జగన్‌బాబు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పీ. కోటేశ్వరరావు, జక్కల వెంకటేష్, ఆంజనేయులు, కే. ఓబులేసు, వంగిమళ్ళ రంగారెడ్డి, కే. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.













