రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో రైతులకు ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం (CHC – Custom Hiring Centre) ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. సంబేపల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో యంత్రాల వినియోగం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేసుకునేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు.
ట్రాక్టర్లు, రోటావేటర్లు, ట్రాలీలు తదితర వ్యవసాయ పరికరాలు ఒకే కేంద్రంలో అద్దెకు అందుబాటులో ఉండడం వల్ల రైతులపై పెట్టుబడి భారం తగ్గుతుందని మంత్రి వివరించారు. దీంతో వ్యవసాయ పనులు వేగవంతమై పంటల ఉత్పాదకత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నీటి వనరుల అభివృద్ధి, మార్కెటింగ్ సౌకర్యాలు వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఆయన చెప్పారు.
ప్రతి రైతు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో, ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఇలాంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం













