అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ డిపోలో మేనేజర్‌ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMUA) ఆధ్వర్యంలో గేట్‌ ధర్నా రెండో రోజుకు కొనసాగింది. డిపో గ్యారేజ్‌ వద్ద ఉదయం 11 గంటలకు టీ విరామ సమయంలో నిర్వహించిన ఈ ధర్నాలో ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.

దాదాపు నాలుగు నెలలుగా డ్రైవర్లు, కండక్టర్లకు ఫిక్స్‌డ్ చార్ట్‌ వేయకుండా, కేవలం NMUA సభ్యులను మాత్రమే స్పేర్ డ్యూటీలకు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ విధానంతో ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతోందని, డ్యూటీ కేటాయింపుల్లో పారదర్శకత లేకపోవడం వల్ల సేవల నిర్వహణపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

అలాగే ఏ.డీ.సీల సప్లింగ్ అనంతరం ఖాళీల భర్తీకి అవసరమైన మేరకు డ్రైవర్లు, కండక్టర్ల నుంచి ఓ.డీ. తీసుకోకుండా, ఒక వర్గం సభ్యులకు మాత్రమే అవకాశం కల్పించే విధంగా ఓ.డీ. నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని నాయకులు విమర్శించారు. ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులకు మాత్రమే ఓ.డీ. అవకాశం కల్పించేలా ఉన్న నోటీసు బోర్డును రద్దు చేసి, ఎస్.డీ.ఐ. కోసం ప్రత్యేక నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ప్రమోషన్ ప్యానల్‌లో ఉన్న డ్రైవర్లకు సరైన శిక్షణకు సమయం కేటాయించి, వారికి అవసరమైన ఓ.డీ. అవకాశాలు కల్పించాలని నాయకులు కోరారు. ట్రాఫిక్ సూపర్‌వైజర్లపై ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల దౌర్జన్యాలను అరికట్టాలని, డిపోకు ప్రత్యేకంగా ట్రాఫిక్ ఇన్‌చార్జిని కేటాయించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.

కాలం చెల్లిన టిమ్ మెషీన్లకు డ్యామేజ్ పేరుతో ఉద్యోగుల నుంచి రికవరీ చేయడం వెంటనే నిలిపివేయాలని, టిమ్ మెషీన్లకు నూతన కవర్లు ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. ఉద్యోగులపై అన్యాయ భారం మోపే చర్యలను నిలిపి, అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం డిపో మేనేజర్‌ స్వయంగా చొరవ చూపాలని, లేనిపక్షంలో జిల్లా కమిటీ ఇచ్చే తదుపరి పిలుపు మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు తెలిపారు. డిపోలో కొనసాగుతున్న విధానాలను మార్చకపోతే, ఆందోళన తీవ్రత పెరగవచ్చని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిటీ సభ్యులు డి.ఎస్. వాసులు, ఎం.ఎన్. రావు, డిపో అధ్యక్షులు డి.వి. సుబ్బయ్య, డిపో కార్యదర్శి డి. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఎం.డి. ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రాయచోటి డిపోలో ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం, కొంతమంది ప్రయోజనాలకు అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరించడం మానుకోవాలని కోరారు.