రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫస్ట్ బ్రాంచ్ ఆర్ఐ మహబూబ్ బాషా ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని, పేద విద్యార్థులపై అన్యాయం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంస్థలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు ఇప్పటివరకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, వారి పేర్లపై 17 వేల రూపాయలు బకాయిలు ఉన్నాయని యాజమాన్యం పట్టుబడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే టీసీలు ఇవ్వలేమని ఆర్ఐ మహబూబ్ బాషా వాదిస్తున్నాడని వారు పేర్కొన్నారు.
ఇక అదే బ్రాంచ్‌లో ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసిన భద్రయ్యకు రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా, పైగా ఆయనపై బెదిరింపులు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ భద్రయ్యను వేధించడంతో, ఆయన చైతన్య బ్రాంచ్‌ను వదిలి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేపట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం భద్రయ్య పేదరికంలో చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఇద్దరు పిల్లలు రాయచోటి శ్రీ చైతన్య స్కూల్లోనే చదువుకుంటున్నారు. అయితే, 17 వేల రూపాయల ఫీజు బకాయి ఉందని కారణం చూపుతూ, ఆ ఇద్దరు విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా యాజమాన్యం ఆలస్యం చేస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పేద విద్యార్థులు 17 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నిజమైతే, అదే సమయంలో ఆ ఉపాధ్యాయుని నుంచి పని చేయించుకొని రెండు నెలల జీతం ఇవ్వకుండా ఎందుకు ఉంచారో, ఈ వ్యవహారంలో చైతన్య విద్యాసంస్థల ఫస్ట్ బ్రాంచ్ యాజమాన్యం ఉపాధ్యాయునికి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతోందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు ఆక్షేపిస్తున్నారు.
పేద విద్యార్థులతో ఇలా ఆటలాడటం సరైంది కాదని, విద్యాసంస్థలు లాభనష్టాలకంటే మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఫీజు బకాయిల సమస్యను పరిష్కరించే దిశగా యాజమాన్యం ముందుకు రావాలని, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని వారు కోరుతున్నారు.













