రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు: చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని శిశు విహార్‌ను జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ కుమార్ మంగళవారం సందర్శించారు. అక్కడి సౌకర్యాలు, పిల్లలకు అందిస్తున్న సేవలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. శిశు విహార్‌లో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి వారి పరిస్థితులు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దత్తత ప్రక్రియకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. మిషన్ వాత్సల్య పోర్టల్‌లో దత్తతకు సంబంధించిన డేటా నమోదు విధానాన్ని, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. దత్తత ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

శిశు విహార్ భవనంలో అవసరమైన అభివృద్ధి, భద్రతా పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. భవనానికి పెయింటింగ్, విద్యుత్ వైరింగ్ సక్రమంగా ఉండేలా చూడాలని, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచి భద్రతను బలోపేతం చేయాలని సూచించారు. ఓపెన్ కారిడార్ పైకప్పు భాగంలో ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసి పిల్లల భద్రతను మరింత పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు.
పిల్లల ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా జరిగేలా పీడియాట్రిషియన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సూచించారు.

శిశు విహార్‌లోని పిల్లలకు మిల్క్ పౌడర్ ప్యాకెట్ల కొనుగోలుకు జిల్లా కలెక్టర్ నిధుల నుంచి రూ.25,000లను తక్షణమే విడుదల చేశారు. పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, సర్వతోముఖ అభివృద్ధిపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు అవసరమైన పోషకాహారం, విద్య, వినోద సదుపాయాలపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి వెంకటేశ్వరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, సూపరింటెండింగ్ ఇంజనీర్ (పంచాయతీరాజ్) కె. మల్లికార్జున మూర్తి, డీసీపీఓ సుబ్రమణ్యం, ప్రొటెక్షన్ ఆఫీసర్లు రాధ, శివశంకర్, లీగల్ ఆఫీసర్ వెంకటేశులు, శిశు విహార్ మేనేజర్ రమ్య తదితరులు పాల్గొన్నారు.













