చిత్తూర్:- నాలుగో డివిజన్ కట్టమంచి ప్రాంత ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం దొరికింది. టిడిపి నాయకురాలు డాక్టర్ సి కె లావణ్య బాబు చొరవతో ఈ సమస్యపై సంబంధిత అధికారుల దృష్టి పడటంతో, మురుగునీటి కాలువ సమస్యకు నగరపాలక సంస్థ స్థాయిలో చర్యలు ప్రారంభమయ్యాయి.

ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సి కె లావణ్య బాబు గత మూడు రోజులుగా నాలుగో డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కట్టమంచి ప్రాంతంలోని వివిధ వీధుల్లో తిరిగి, స్థానికులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు సేకరించారు. ముఖ్యంగా మురుగునీటి కాలువలు తరచూ మూసుకుపోవడం, నీరు నిల్వ ఉండటం వల్ల వస్తున్న ఇబ్బందులను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ ప్రజారోగ్యం విభాగం అధికారులతో డాక్టర్ సి కె లావణ్య బాబు సమావేశమయ్యారు. కట్టమంచి నాలుగో డివిజన్‌లోని డ్రైనేజ్ సమస్య తీవ్రత, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె అధికారులకు వివరించారు. దీనిపై అధికారులు స్పందించి, మురుగునీటి కాలువల శుభ్రపరిచే పనులు, అవసరమైన మరమ్మతులు చేపట్టేలా చర్యలు ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు.

డ్రైనేజ్ సమస్య పరిష్కార దిశగా చర్యలు మొదలయ్యాక కాలనీలోని ప్రధాన వీధులు, గల్లీలలో మురుగునీటి నిల్వ తగ్గడం ప్రారంభమైందని నివాసితులు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఈ సమస్యపై చివరకు అధికార యంత్రాంగం కదలిక కనిపించడంతో ప్రజల్లో ఉపశమనం వ్యక్తమవుతోంది.

ఈ సందర్భంగా కాలనీవాసులు డాక్టర్ సి కె లావణ్య బాబు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నందుకు ఆమెను అభినందించారు. స్థానికుల అభిప్రాయం మేరకు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలాగే సమన్వయంతో ముందుకు వస్తే, కట్టమంచి వంటి పాత కాలనీల్లో ఉన్న మరిన్ని సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు.