రాయలసీమ న్యూస్, చిత్తూరు: పలమనేరు పట్టణంలో ఇసుక అక్రమ రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసులు ముమ్మర చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 10, 2026 సోమవారం ఉదయం పలమనేరు అర్బన్ పోలీస్ సిబ్బంది పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ పర్యవేక్షణ చేపట్టారు.

ఈ పర్యవేక్షణ సమయంలో లక్ష్మీనగర్ కాలనీ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఒక ట్రాక్టర్ ద్వారా ఇసుకను అక్రమంగా దించుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో పట్టుబడిన వ్యక్తిని గంగవరం రాజు (52), తండ్రి వెంకటప్ప, పలమనేరు మండలం నివాసిగా గుర్తించారు. నిందితుడు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గంగవరం మండల పరిధిలోని కౌండిన్య నది నుంచి ఇసుకను అక్రమంగా సేకరించినట్లు విచారణలో బయటపడింది.
కౌండిన్య నది నుంచి సేకరించిన ఆ ఇసుకను ట్రాక్టర్ ద్వారా పలమనేరు పట్టణానికి తరలించి, రహస్యంగా నిల్వ చేస్తున్నట్లు నిందితుడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఘటన స్థలంలో నిందితుడి వద్ద నుంచి సుమారు ఐదు టన్నుల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇసుక రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్‌ను కూడా స్వాధీనం చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇసుకను ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా సేకరించి, రవాణా చేసి నిల్వ చేసినందుకు సంబంధిత వ్యక్తిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై BNS సెక్షన్ 303(2) (దొంగతనం)తో పాటు సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ ( డెవలప్మెంట్ అండ్ రేగులాషీన్ ) Act, 1957 ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై చర్యలను మరింతగా కట్టుదిట్టం చేయాలని పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. పట్టణ పరిధిలో అనుమతి లేకుండా ఇసుక తవ్వకం, రవాణా, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించి, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు కూడా సమాచారం అందించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించబోమని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి అక్రమ ఇసుక వ్యాపారంలో పాల్గొనే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పలమనేరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై ఈ మధ్యకాలంలో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసుల ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన ఈ ముమ్మర చర్యలు కొనసాగనున్నాయని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, రవాణా చేయడం లేదా అక్రమంగా నిల్వ చేయడం చట్టరీత్యా నేరం. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.













