రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: మాంచెస్టర్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలుకానుంది. గ్రూప్–1లో తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు ఆదివారం దక్షిణాఫ్రికా రూపంలో గట్టి సవాలు ఎదురవుతోంది. రాత్రి 7 గంటలకు ఈ కీలక పోరు ప్రారంభం కానుంది.
గ్రూప్–1 తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ సులభంగా ఓడించింది. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై కూడా భారత అమ్మాయిలు ఏకపక్ష విజయం సాధించారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు టోర్నీ ఆరంభాన్ని ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సఫారీ జట్టు, తర్వాత పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి పుంజుకుంది. ఈ టోర్నీలో అత్యంత బలమైన జట్లలో దక్షిణాఫ్రికా ఒకటిగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇద్దరు జట్ల మధ్య ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 1–4 తేడాతో ఓటమి పాలైన విషయం గమనార్హం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ అదే జట్టును ప్రపంచకప్ వేదికపై ఎదుర్కోవాల్సి రావడం భారత జట్టుకు సవాలుగా మారింది. ఆరు జట్లు ఉన్న గ్రూప్–1 నుంచి సెమీఫైనల్స్‌కు కేవలం రెండు జట్లు మాత్రమే అర్హత సాధిస్తాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా బలాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఆ జట్టు ముందంజ వేయడం ఖాయమనే అభిప్రాయం నిపుణులది.
ఈ నేపథ్యంలో భారత్–దక్షిణాఫ్రికా పోరు గ్రూప్ సమీకరణాల పరంగా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టే రెండో సెమీస్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పోరులో భారత్ ఓడిపోతే, తర్వాత ఆస్ట్రేలియాపై తప్పనిసరిగా గెలవాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి శక్తిని వినియోగించాల్సిన అవసరం ఉంది.
భారత్ బ్యాటింగ్ వైపు చూస్తే, ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు అదనపు బలం. మధ్యవరుసలో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాణించాల్సిన అవసరం ఉంది. ఫినిషర్‌గా రిచా ఘోష్ ఇప్పటివరకు తన పాత్రను సమర్థంగా పోషిస్తోంది. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీ చరణి అద్భుత ఫామ్‌లో ఉన్నారు. అయితే పేస్ బౌలింగ్‌లో భారత్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా వోల్వార్ట్ ప్రధాన బలం. ఆమె వికెట్ సాధించడం భారత బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది. అలాగే తజ్మిన్ బ్రిట్స్, లుజ్, నదైన్ డిక్లెర్క్, డెర్క్‌సెన్ వంటి బ్యాటర్లు ఆ జట్టు టాప్ ఆర్డర్‌ను బలంగా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఈ పోరు సెమీఫైనల్ బెర్త్ దిశగా కీలక మలుపుగా మారింది.







