సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే!

..రంకెలేస్తున్న పాక్

సింధు నదీ జలాల ఒప్పందంను నిలిపివేయాలన్న భారతదేశం నిర్ణయం పాకిస్తాన్‌లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఒప్పందం అమలును నిలిపివేసిన నేపథ్యంలో సింధు జలాల ప్రవాహాన్ని ఆపితే అది యుద్ధానికి దారితీసే చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ వైపు నుంచి కొత్త హెచ్చరికలు వెలువడుతున్నాయి. పౌర ప్రభుత్వంతో పాటు సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించడం అక్కడ రాజకీయ, రక్షణ వర్గాల్లో కలకలం రేపుతోంది.

పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం ఇటీవల జరిగింది. ఈ భేటీలో సింధు జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24నాటి National Security Committee (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని సైన్యం మరోసారి పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధు నదీ జలాల వాటాను దక్కించుకునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది.

తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధు జలాల హక్కుల కోసం పోరాడుతామని పాక్ సైన్యం వెల్లడించింది. గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా 1960 నాటి Indus Water Treatyను భారతదేశం Abeyanceలో పెట్టింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ సైన్యం, మంత్రులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కడంతో పాటు యుద్ధ హెచ్చరికలు జారీ చేయడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

పాకిస్తాన్ NSC గతంలోనే కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని "Act of War"గా పరిగణించాలని NSC నిర్ణయించింది. ఆఫ్ఘన్ Taliban పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై "Operation Gazab-lil-Haq" కింద పోరాడుతామని NSC పేర్కొంది. అలాగే Kashmiri ప్రజలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, Pakistan Peoples Party (PPP) చైర్మన్ Bilawal Bhutto Zardari చేసిన వ్యాఖ్యలపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తి లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, అన్ని రంగాలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము.

పాకిస్తాన్‌ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు Indus Water Treaty నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి Ranthir Jaiswal స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతున్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేసింది.

1960లో World Bank మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక Indus Water Treaty ప్రకారం తూర్పు నదులైన Ravi, Sutlej, Beas జలాలు భారత్‌కు, పశ్చిమ నదులైన Indus, Jhelum, Chenab జలాలు పాకిస్తాన్‌కు దక్కాలి. సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్‌తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో ఆ సమాచారాన్ని పంచుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉండదు.

సింధు బేసిన్‌లో Sawalkot, Ratle, Bursar, Pakal Dul, Kwar, Kiru, Kirthai వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80-90 శాతం సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ప్రధాన జలాశయాలైన Tarbela, Mangla Damలలో నీటి నిల్వలు దాదాపు dead storage స్థాయికి చేరుకున్నాయి.

తమ అత్యంత బలహీనమైన పాయింట్‌గా భావిస్తున్న నీటి రంగాన్ని భారత్ టార్గెట్ చేస్తోందని పాకిస్తాన్ తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు పాక్ రాయబారులను పంపడం, United Nationsకు లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.