రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల: నంద్యాల పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న సోమవారం పలు వార్డుల్లో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. నగరంలోని ప్రధాన వీధులు, నివాస ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనుల తీరును ఆయన స్వయంగా తనిఖీ చేశారు.
మొదటగా 21వ వార్డులోని ఇందిరానగర్, నూనెపల్లి బ్రిడ్జి పరిసరాల్లో కమిషనర్ శేషన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి పర్యటించారు. అక్కడి పారిశుధ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, చెత్త సేకరణ, కాలువల శుభ్రత, రోడ్ల పరిశుభ్రతపై సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం 18వ వార్డులోని ఈశ్వర్ నగర్, 12వ వార్డులోని బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిసరాలను తనిఖీ చేశారు.
పర్యటన సందర్భంగా ఎక్కడకక్కడ చెత్తాచెదారం పేరుకుపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, ఇందుకు నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు సూచించారు.
ప్రధాన రహదారులు, ప్రజలు నివసించే కాలనీలు, గల్లీల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ స్పష్టం చేశారు. వర్ష కాలం నేపథ్యంలో నీటి నిల్వలు, చెత్త పేరుకుపోవడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా, అంటువ్యాధుల భయం లేకుండా మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన ఆదేశించారు.
విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించినట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి. పారిశుధ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజల ఆరోగ్యం, శుభ్రత విషయంలో మున్సిపల్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించినట్లు సమాచారం.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో కమిషనర్ బి. శేషన్న వెంట మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్, శభరీష్, శానిటేషన్ సూపర్‌వైజర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి తో పాటు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పర్యటన మొత్తం సమయంలో వివిధ వార్డుల్లో పారిశుధ్య పనుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు.













