రాయలసీమ న్యూస్, నంద్యాల: శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతపు సెలవులు రావడంతో స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
భక్తుల భారీ రద్దీ కారణంగా దేవస్థాన అధికారులు నేడు విరామ బ్రేక్ దర్శనాలను నిలిపివేశారు. సిఫారసు లేఖలతో వచ్చే వారికి కూడా శ్రీ స్వామి, అమ్మవారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే మనమిత్ర , వాట్సాప్ ఆన్లైన్ ద్వారా, అలాగే స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు నిర్దిష్ట వేళల్లో స్పర్శ దర్శనానికి అనుమతి కల్పిస్తున్నారు.
క్యూలైన్లలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటమే లక్ష్యంగా స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, EO శ్రీనివాసరావు సమీక్షించి అమలు చేస్తున్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల క్యూలైన్ల ద్వారా భక్తులు భారీగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ప్రతి క్యూలైన్ వద్ద భక్తుల ప్రవాహాన్ని నియంత్రించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు.
క్యూలైన్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, EO శ్రీనివాసరావు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం, గోపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు పోలీసులు, దేవస్థాన భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం శ్రీస్వామి, అమ్మవార్ల దర్శనానికి సగటున నాలుగు గంటల సమయం పడుతోంది. అయినప్పటికీ భక్తులు ఓర్పుతో క్యూలైన్లలో నిలబడి స్వామి, అమ్మవార్ల దర్శనానందం పొందుతున్నారు. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది. ఆలయ పరిసరాల్లో అన్నదాన కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు భక్తుల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి.













