జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు

ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…

న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నిరసనలు ప్రారంభించింది. నీట్ పేపర్ లీక్‌, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వ్యవస్థలో అవకతవకల నేపథ్యంలో ఈ ఆందోళనలను చేపడుతోంది. సీజేపీ వ్యవస్థాకుడు అభిజీత్‌ దీప్కే ఇచ్చిన పిలుపుమేరకు వేలాదిమంది యువత నిరసన వేదిక వద్దకు తరలివచ్చారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’, ‘మేము మేక్‌ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు’ అని నినాదాలు చేశారు. 

అమెరికా నుంచి భారత్‌కు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చేరుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఆయన దిగారు.

విమానాశ్రయ టెర్మినల్‌లో తెల్లటి టీ షర్ట్, నల్లటి హుడీ, నల్లటి టోపీ ధరించి నడుచుకుంటూ వస్తున్న అభిజీత్ దీప్కే దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఎయిర్‌పోర్టులో ఆయనను పలువురు మద్దతుదారులు స్వాగతించిన దృశ్యాలు, ఆయన మాట్లాడుతున్న వీడియోలు వివిధ సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతున్నాయి. సీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఈ వీడియోలను పెద్ద ఎత్తున ఫార్వర్డ్ చేస్తూ తమ మద్దతును వ్యక్తం చేస్తున్నారు.

విమానం దిగిన వెంటనే అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా మద్దతుదారులకు సందేశం పంపారు. జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసనలో పాల్గొనబోయే వారందరూ శాంతిని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌కు వచ్చా. జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఎదురుచూస్తున్నా. ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని, త్రివర్ణ పతాకాన్ని తీసుకురావడం మర్చిపోకండి. కరుణ, కృతజ్ఞతకు చిహ్నంగా పోలీసులకు పువ్వులు సమర్పించండి. మనం ఈ ఉద్యమాన్ని ప్రేమ, శాంతితో నడిపించాలి అభిజీత్ దీప్కే ఎక్స్‌లో చేసిన ఈ పోస్టును సీజేపీ మద్దతుదారులు విస్తృతంగా రీట్వీట్ చేస్తూ, నిరసనలో భారీగా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.

ఢిల్లీ పోలీసు అప్రమత్తం..

సీజేపీ పిలుపు మేరకు జరుగుతున్న ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసు వ్యవస్థ అప్రమత్తమైంది. రాజధాని అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వెయ్యి మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, ఢిల్లీ సరిహద్దు ప్రవేశ మార్గాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక దళాలు, ట్రాఫిక్ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.

ఇటీవలి కాలంలో నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలు, వాటి నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలపై సీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఈరోజు జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అభిజీత్ దీప్కే భారత్ రాకతో ఈ నిరసనకు మరింత ప్రచారం లభించింది.