రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టిన ఈ ఆందోళనలకు విపక్షాలు కూడా తోడయ్యాయి. ఈ లీక్ అంశంపైనే పార్లమెంట్‌లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. ఈ పరిణామాల వేళ ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు (Fast-Track Courts For Paper Leak Trials)లను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.
యువత భవిష్యత్తుకు హాని చేయాలని చూసేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. ‘‘విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది కొనసాగింపు. పేపర్ లీక్ బాధ్యులకు శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు’’ అని ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు.
మోదీ పోస్ట్‌కు రాహుల్ రియాక్షన్..
మోదీ ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘మన యువత భవిష్యత్‌కు హాని చేసింది మీరే. మన విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే చూసి, బాధ్యులైన వారిని రక్షించారు. ఇప్పుడు విద్యార్థులు డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. 1. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలి. 2. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. 3. యువతపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని రాహుల్ (Rahul Gandhi) ఎక్స్ రాసుకొచ్చారు.
సీజేపీ ఏమందంటే..?
ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని చేసిన ప్రకటనపై అటు సీజేపీ (CJP) కూడా స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉండగా.. సీజేపీ ఆందోళనల దృష్ట్యా గురువారం కూడా దిల్లీలో 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు.







