రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
భారత్‌లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా మారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య పేరిట జరుగుతోన్న దోపిడీని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ.. ఆ ఇద్దరూ మౌనం వహించారని, జవాబుదారీతనం నుంచి తప్పుకొన్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘‘అవినీతి, అన్యాయం, పక్షపాత వైఖరి, నిజాయితీ లోపించడం... ఈ నాలుగు పదాలు నేను చెప్తున్నవి కాదు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు విద్యా వ్యవస్థను ఉద్దేశించి వాడుతున్న పదాలు. భారత విద్యా వ్యవస్థ ఇప్పుడు మోసపూరితమైన, దోపిడీ యంత్రాంగంగా మారిపోయింది’’ అని రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థ.. కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని విమర్శించారు. విద్యా వ్యవస్థలోని అవినీతి వల్లే పేపర్ లీకేజీ మాఫియా పురుడు పోసుకుందని, లక్షల మంది విద్యార్థులు ఏళ్లపాటు పడుతున్న కష్టాన్ని ఒక్క దెబ్బతో దోచేస్తోందని అన్నారు. తప్పు చేసిన సంస్థలకు టెండర్లు, అధికారులకు ప్రమోషన్లు వస్తున్నాయి గానీ, శిక్ష మాత్రం.. తమ కలలను సాధించుకోలేక, ఒంటరిగా మిగిలిపోతున్న విద్యార్థులకు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇవన్నీ తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇప్పుడైనా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తనతోపాటు అడుగేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దేశ విద్యా వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి విద్యార్థుల స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే లక్ష్యంతో రాహుల్ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరిట సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తొలివిడతగా జూన్ 17న రాజస్థాన్‌లోని కోటాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో విడతగా దేహ్రాదూన్‌లో జులై 17న ఈ కార్యక్రమం జరగనుంది.







