రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్ ఎంపీల మద్దతు నిర్ణయం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్ ఎదురైంది.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు కేంద్రంలోని అధికార కూటమి ఎన్‌డీఏకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ తిరుగుబాటు ఎంపీలకు లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ విప్‌గా ఉన్న కాకోలీ ఘోష్ దస్తిదార్ సారథ్యం వహిస్తున్నారు.
కాకోలీ ఘోష్ దస్తిదార్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తమ నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు ఇప్పటికే తెలియజేశామని, ఈ మేరకు లేఖ కూడా సమర్పించామని వెల్లడించారు. లోక్‌సభలో పార్టీ విప్‌గా తానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. బెంగాల్‌లో వచ్చిన ప్రజాతీర్పు ఆధారంగానే కేంద్రంలో ఎన్‌డీఏకు మద్దతివ్వాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, కాకోలీ ఘోష్ దస్తిదార్‌ను పార్టీ విప్ పదవి నుంచి మమతా బెనర్జీ తొలగించి, ఆ స్థానంలో ఎంపీ కల్యాణ్ బెనర్జీని నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్పుపై లోక్‌సభ సెక్రటేరియట్‌కు తృణమూల్ కాంగ్రెస్ అధికారిక సమాచారం ఇవ్వలేదని ఒక రెబెల్ ఎంపీ వెల్లడించారు. ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించిన ఈ 20 మంది తృణమూల్ ఎంపీలు తక్షణం పార్టీని వీడి BJPలో చేరాలని మాత్రం భావించడం లేదని, లోక్‌సభలో ఎన్‌డీఏకు మద్దతు ఇస్తూ వేరు శిబిరంగా కొనసాగాలని యోచిస్తున్నట్లు సమాచారం.
రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్ రాయ్ రాజీనామా..
ఇక మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్ రాయ్ సోమవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ గత ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని, పార్టీ యంత్రాంగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, దీని ఫలితంగానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉద్భవించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన RG Kar ఆస్పత్రి ఘటనలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన పోలీసు అధికారులపై అంతర్గత విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేశానని, ఆ కారణంగా తనను పార్టీలో పక్కనపెట్టారని సుకేందు శంకర్ రాయ్ తెలిపారు. అప్పట్లోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.







