అమరావతి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన రెండేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వెన్నుపోటుకు కాదని, ప్రజా విముక్తికే ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ రాజకీయాలకు 2024లోనే ప్రజలు చరమగీతం పాడారని మంత్రి అన్నారు.

గురువారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేపడుతున్న నిరసనలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన పార్టీకి చెందినవారే ఇప్పుడు ప్రజల తీర్పును అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే చర్యలు జరిగాయని ఆరోపించారు.

వైసీపీ పాలనలో ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సి వచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కిన పార్టీ వైసీపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో తిరగని జగన్ ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పరదాల చాటున పాలన చేసిన రోజులను ప్రజలు మరచిపోలేదని వ్యాఖ్యానించారు.

రైతులు, యువత, మహిళలను వైసీపీ మోసం చేసిందని మంత్రి మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి, ప్రతీకార రాజకీయాలకు వైసీపీ పెట్టింది పేరని అచ్చెన్నాయుడు విమర్శించారు. పరిశ్రమలను తరిమికొట్టి పెట్టుబడులను దూరం చేసిందని దుయ్యబట్టారు.

ప్రజల తీర్పుతో వైసీపీ అహంకారానికి ముగింపు పలికారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల వైసీపీ అసహనం వ్యక్తం చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. సంక్షేమం పేరుతో వైసీపీ మోసపూరిత పాలన సాగించిందని విమర్శించారు.

ప్రజావ్యతిరేక పాలనకు 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక ముగింపు పలికారని అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.