రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
డీఎస్సీ లీకేజీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!
ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ డిమాండ్
డీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా నియామకాల వరకు జరిగిన ప్రతి అంశంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) ద్వారా స్పందించిన వైఎస్ జగన్, డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో జరిగిన ర్యాలీలు విజయవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై నేటి జెన్-జీ (Gen-Z) యువత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించాల్సిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం రోడ్డెక్కించిందని ఆయన విమర్శించారు.
టీచర్ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమైన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, డీఎస్సీ పేపర్ లీకేజీలు, అక్రమాలతో వారి భవిష్యత్తును దెబ్బతీసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. డీఎస్సీ పరీక్షలపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ప్రజల ముందే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటివరకు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశాన్ని డైవర్షన్ రాజకీయాలతో కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని కూడా వైఎస్ జగన్ ఆరోపించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపబోమని, యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి యువకుడు, విద్యార్థికి వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారి హక్కుల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డీఎస్సీ పరీక్షలు, స్పోర్ట్స్ కోటా నియామకాలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.







