హిందూపురం పట్టణంలో బంగారు కుదువ వ్యాపారి అయిన పాన్ బ్రోకర్ భాస్కర్‌పై ఘరానా మోసం ఆరోపణలు వెలుగుచూశాయి. వికలాంగుడైన షామీర్ భాష అనే వ్యక్తి పెట్టిన బంగారు కుదువను తిరిగి ఇవ్వకుండా, డబ్బు, వడ్డీ చెల్లింపుల విషయంలో మోసపూరితంగా వ్యవహరించాడని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితుడు బంధువులతో కలిసి భాస్కర్ ఇంటి ముందు ధర్నా నిర్వహించాడు.

వివరాల్లోకి వెళితే, హిందూపురం పట్టణానికి చెందిన షామీర్ భాష 2014లో పాన్ బ్రోకర్ భాస్కర్ వద్ద అర్ధ కిలో బంగారు కుదువ పెట్టి 11 లక్షల 70 వేల రూపాయలు నగదు తీసుకున్నాడు. అనంతరం ఆ బంగారు కుదువకు సంబంధించిన సొమ్ములో 5 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. మిగిలిన మొత్తం, వడ్డీ సహా చెల్లించి బంగారు తిరిగి పొందాలని షామీర్ భాష ప్రయత్నించినప్పటికీ, భాస్కర్ బంగారు ఇవ్వకుండా ఎగ్గొట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

ఈ విషయంపై షామీర్ భాష పలుమార్లు హిందూపూర్ Two టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినప్పటికీ, తనకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులతో కలిసి CPI నాయకత్వంలో ఆందోళనకు దిగాడు. CPI హిందూపూర్ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో షామీర్ భాష, ఆయన కుటుంబ సభ్యులు, CPI నాయకులు బుధవారం భాస్కర్ ఇంటి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

షామీర్ భాష కుదువ పెట్టిన బంగారు అసలు, వడ్డీ తీసుకొని తిరిగి ఇవ్వాలన్న అంశంపై మే 30న హిందూపూర్ పట్టణంలోని Two టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పటి SI లింగన్న సమక్షంలో పంచాయతీ జరిగినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు మళ్లీ ఆందోళనకు దిగారు.

ధర్నా సందర్భంగా పాన్ బ్రోకర్ భాస్కర్, ఆయన భార్య బాధితులకు, CPI నాయకులకు బంగారు అమ్మేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "మీకు ఏమైనా ఉంటే కోర్టులో వేసుకోండి" అంటూ బుకాయించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. బంగారు ఇచ్చేవరకు అక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని బాధితుల కుటుంబ సభ్యులు, CPI నాయకులు బీస్మించుకొని దాదాపు రెండు గంటల పాటు బైఠాయించి నిరసన కొనసాగించారు.

విషయం తెలుసుకున్న హిందూపూర్ Two టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సర్దిచెప్పారు. ఇరు వర్గాలూ పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించడంతో, బాధితులు, భాస్కర్ కుటుంబం పోలీసుల వద్దకు వెళ్లారు. అనంతరం ASP మహేష్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల వాదనలు విని విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో బాధితుడు షామీర్ భాష, ఆయన భార్య అయేషా, బంధువులు, AIYF జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కమల్ భాష, మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సబిరా, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సమివుల్లా, మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు ముత్యాలప్ప, కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.