రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: పుట్టపర్తి: జలాశయం నిర్మాణానికి ముందుగా రైతులను ఒప్పించి, చట్టబద్ధంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. బాధిత రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, చట్టం ప్రకారం పరిహారం నిర్ణయించి, ఆ పరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి. అయితే ముదిగుబ్బ మండలంలో హంద్రీనీవా ఆధారంగా నిర్మిస్తున్న జిల్లేడుబండ రిజర్వాయర్ విషయంలో గత వైకాపా ప్రభుత్వం ఈ ప్రక్రియలను పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గుత్తేదారులకు లాభం చేకూర్చడం, కమీషన్లు దండుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే జలాశయ నిర్మాణం మొదలుపెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారిందని బాధితులు అంటున్నారు.
ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి వద్ద జిల్లేడుబండ చెరువును జలాశయంగా మార్చి, హంద్రీనీవా కాలువ నుంచి నీటిని తరలించాలనే లక్ష్యంతో రూ.680 కోట్లతో ప్రాజెక్టుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తమకు సన్నిహితంగా ఉన్న తెలంగాణకు చెందిన బడా గుత్తేదారుకు పనులు అప్పగించి, 2021 డిసెంబరులో నిర్మాణ పనులు ప్రారంభించారు.
అయితే ప్రాజెక్టు పనులు రెండేళ్ల క్రితమే నిలిచిపోయాయి. అటు పరిహారం అందక, ఇటు పనులు ముందుకు సాగక ముదిగుబ్బ మండల రైతులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. మా భూములు మాకు ఉంటాయో లేదో తెలియడం లేదని బాధితులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ప్రాజెక్టు నిర్మాణం, పరిహారంపై స్పష్టత రాక గందరగోళం కొనసాగుతోంది.
జిల్లేడుబండ జలాశయాన్ని 2.41 టీఎంసీల సామర్థ్యంతో రూపకల్పన చేశారు. ఈ సామర్థ్యంతో 2,500 ఎకరాల భూమితో పాటు పొడరాళ్లపల్లి గ్రామం మొత్తం ముంపులోకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే మంగళమడక, చాగాపురం, గుడ్డంపల్లితండా గ్రామాల్లోని పలువురు రైతుల భూములు కూడా ముంపు ప్రమాదానికి గురవుతాయి.
ఎగువన మూడు కిలోమీటర్ల దూరంలో మారాల జలాశయం ఇప్పటికే నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో జిల్లేడుబండ ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సామర్థ్యాన్ని 1.5 టీఎంసీలకు తగ్గిస్తే పొడరాళ్లపల్లి గ్రామానికి ముంపు బాధ తప్పుతుందని వారు చెబుతున్నారు.
కొన్నినెలల క్రితం హంద్రీనీవా అధికారులు ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యటించి, జలాశయం సామర్థ్యం 1.5 టీఎంసీలు ఉంటే సరిపోతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కొంత పనులు పూర్తయినందున డిజైన్‌లో మార్పులు చేయాల్సి ఉండడంతో, ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎంపీ బీకే పార్థసారథి, ధర్మవరం తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి, ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించి రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు. ఇటీవల బాధిత రైతులు మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించి, తమ సమస్యలను వివరించారు.













