రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న సేవలో పథకం కింద ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.25 వేల చొప్పున సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ నెల 7న బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నల బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థిక సాయం జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కొంతమంది అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.
తాజాగా చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 20లోగా నేతన్న సేవలో పథకం కింద అర్హులందరి బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల ఆర్థిక సాయం తప్పనిసరిగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, ఈ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులను సమస్యలను పరిష్కరించేందుకు ఆదేశించినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. మిగిలిన అర్హులందరికీ కూడా డబ్బులు చేరేలా పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు.
కొత్త దరఖాస్తుదారులకు కూడా ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆమె సూచించారు.
నేతన్న సేవలో పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 71,536 మంది నేతన్నలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు చేనేత శాఖ వివరాలు వెల్లడించాయి. ఇంకా కొంతమంది అర్హులు మిగిలి ఉండడంతో వారిని గుర్తించి అందరికీ సాయం అందించాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు.
మరో 13,678 మంది నేతన్న సేవలో పథకానికి దరఖాస్తు చేసుకున్నారని, వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని శాఖ అధికారులు తెలిపారు. అర్హుల జాబితా ఖరారు చేసిన వెంటనే వారికి కూడా ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు వెల్లడించారు.
నేతన్న సేవలో పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. సొంతంగా చేనేత మగ్గం కలిగి, చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండాలి. చేనేత సంఘాలు, సొసైటీలలో సభ్యత్వం ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందుతుంది.
దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్, చేనేత మగ్గం గుర్తింపు కార్డు లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, ఆదాయ పరిమితి ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్ వంటి పత్రాలు సమర్పించాలి. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చి, వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థిక సాయం జమ చేస్తారు.













