రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: పుట్టపర్తి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సైబర్ నేరాలపై ప్రశాంతి నిలయం సిబ్బందికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రశాంతి నిలయంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న సత్సంగ్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు పుట్టపర్తి డిఎస్పీ సత్యనారాయణ, సీఐ యువరాజ్ పాల్గొన్నారు.
సైబర్ క్రైమ్, మొబైల్ దొంగతనాలపై అవగాహన కల్పించేందుకు ప్రొజెక్టర్ ద్వారా వివిధ ఉదాహరణలను జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన వివరించారు. డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్ స్కాం, హనీ ట్రాప్, కేవైసీ, లోన్ యాప్ స్కామ్‌లతో పాటు జాబు స్కామ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల విధానాలను సిబ్బందికి చూపిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలను తెలియజేశారు.
సత్యసాయి బాబా మహా సమాధి దర్శనార్థం దేశ విదేశాల నుండి ప్రశాంతి నిలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో, ఇలాంటి ప్రదేశాల్లో సైబర్ నేరాల ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలుగా ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రశాంతి నిలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలని, అలాగే దర్శనార్థం వచ్చే భక్తులకు కూడా వీలైనంత మేర అవగాహన కల్పించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన సూచించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను ఒక్కొక్కరితో మాట్లాడి తెలుసుకున్నారు.
ఇప్పటికే సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన కొన్ని ఘటనలను ప్రశాంతి నిలయం సిబ్బంది అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండేందుకు అవసరమైన సూచనలు చేశారు.
మొబైల్ ఫోన్లలో ఉన్న WhatsApp, Telegram వంటి యాప్‌ల వినియోగంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తెలియని లింకులు, సందేశాలు, కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ అంకిత సురాన సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, OTP వంటి కీలక వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సిబ్బందికి స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. ప్రశాంతి నిలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలు, మొబైల్ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు.













