పెనుకొండ: విజయనగర సామ్రాజ్య ద్వితీయ రాజధానిగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన పెనుకొండ కోట పరిధిలో అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. కోటలోని కాశీవిశ్వేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న బసవన్న బావి (మెట్లబావి–కోనేరు) లోపలి రాతిపై చెక్కబడిన సంస్కృత ఏకవాక్య శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించి విశ్లేషించారు.

బావి లోపలి రాతి నిర్మాణంపై ‘శ్రీత్రయంబక శరణు’ అనే సంస్కృత ఏకవాక్య శాసనం రెండు వరుసలుగా కన్నడ లిపిలో చెక్కబడి ఉంది. ఈ శాసనాన్ని జలనిధి శాసనంగా మైనాస్వామి పరిశీలించారు. బావి నిర్మాణ శైలి, రాతి పై చెక్కిన లిపి, శాసనంలోని పద ప్రయోగాలు విజయనగర కాలపు జలసంస్కృతి, నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన విశ్లేషణలో వెల్లడైంది.

విజయనగర సామ్రాజ్య చక్రవర్తులైన శ్రీక్రిష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల పాలనాకాలంలో శైవ సంప్రదాయాలకు ఉన్న ప్రాధాన్యతకు ఈ శాసనం బలమైన ఆధారంగా నిలుస్తోందని చరిత్రకారులు భావిస్తున్నారు. త్రయంబక స్వరూపాన్ని స్మరించుకునే విధంగా ‘శ్రీత్రయంబక శరణు’ అనే వాక్యాన్ని బావి లోపలి భాగంలో చెక్కడం ద్వారా ఆ కాలంలో నీటి వనరులను పవిత్ర స్థలాలుగా భావించిన దృక్పథం స్పష్టమవుతోందని వారు సూచిస్తున్నారు.

పెనుకొండ కోట పరిసరాల్లో ఇప్పటివరకు గుర్తించిన శాసనాల్లో జలనిధి శాసనంగా ఈ బసవన్న బావి శాసనం ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. కోటలోని ఇతర నిర్మాణాలతో పోలిస్తే ఈ బావి రాతి నిర్మాణం, మెట్లు, లోపలి గోడలపై చెక్కిన శిల్పాలు విజయనగర శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

పెనుకొండ ప్రాంత చరిత్ర పరిశోధనలో ఈ కొత్త శాసనం మరిన్ని అధ్యయనాలకు దారితీసే అవకాశం ఉందని స్థానిక పరిశోధకులు చెబుతున్నారు. విజయనగర సామ్రాజ్య కాలపు జలవనరుల నిర్మాణం, వాటి ధార్మిక–సాంస్కృతిక నేపథ్యంపై ఈ శాసనం ఆధారంగా మరింత లోతైన పరిశోధన అవసరమని వారు సూచిస్తున్నారు.