రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రాత్రివేళల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బీట్ గస్తీ, ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగించారు.
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో రాత్రివేళల్లో అదనపు బలగాలను మోహరించి తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, రాత్రివేళల్లో బాధ్యతాయుతంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు విచారిస్తూ, అవసరమైన వారి వివరాలను నమోదు చేసి వేలిముద్రలు సేకరిస్తున్నారు. అనవసరంగా రాత్రివేళల్లో బయట సంచరించడం వల్ల కలిగే ప్రమాదాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు కూడా అనుమానాస్పద కదలికలు, వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బ్యాంకులు, ఏటీఎంలు, ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లు, ఒంటరిగా ఉన్న గృహాల పరిసరాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చోరీలకు అవకాశం లేకుండా చర్యలు చేపడుతూ, ఆ ప్రాంతాల్లో రాత్రి గస్తీని పెంచారు. నివాస ప్రాంతాల్లో కూడా బీట్ పోలీసుల సంచారం పెంచి, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తున్నారు.
గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు, ప్రజా సమావేశాల ద్వారా సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, ఇతర సామాజిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో యువత, మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
అదేవిధంగా రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అవసరమైన వారికి చట్టపరమైన సూచనలు అందిస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాత్రివేళల్లో విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు, ప్రజలలో భద్రతాభావాన్ని మరింత బలపరచడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు.













