పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకుని, ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. కిద్మాత్ ఖల్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడారు.

పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పుట్టపర్తికి చెందిన కిద్మాత్ ఖల్కే చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో వికలాంగులకు వీల్‌చైర్లు అందజేశారు. వీల్‌చైర్లను ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా అందించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వికలాంగుల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు. వికలాంగులకు అవసరమైన సహాయాన్ని అందించడం మానవతా దృక్పథానికి నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, సాధారణ ప్రజలు కూడా సహకారం అందించాలని ఆమె కోరారు. సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే వివరించారు.

కిద్మాత్ ఖల్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దొన్నికోటకు చెందిన నీరుగంటి గంగులమ్మ కుమారుడు, ఎనిమిదేళ్ల చిన్నారి నీరుగంటి బాబు, పుట్టపర్తికి చెందిన దివ్యాంగుడు వివేకానందకు అత్యంత విలువైన వీల్‌చైర్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అభినందించారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు తెలిపారు. సమాజంలో సేవా భావాన్ని మరింతగా పెంపొందించేందుకు చారిటబుల్ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు.

కార్యక్రమంలో కిద్మాత్ ఖల్కే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షామీర్, రాష్ట్ర జీవనోపాధుల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ యశోదా రాయుడు, సభ్యులు చిన్న కుళ్ళాయప్ప, మురుగన్, శేషు, జావేద్ బాషా, సాయి, కొరియర్ రమేష్, సాయి ప్రసాద్, నయాజ్ తదితరులు పాల్గొన్నారు.