141 ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు,

LHMS యాప్ వినియోగంపై ఎస్పీ సూచనలు

పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పోలీసులు కేవలం 45 రోజుల్లో రూ. 29 లక్షల విలువైన 141 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. గత ఐదు నెలల కాలంలో మొత్తం 270 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ అత్యంత ముఖ్యమైన సాధనంగా మారిందని, అందువల్ల దానిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న, చోరీ కేసులకు సంబంధించి CEIR పోర్టల్, IMEI నంబర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు ఆయన వివరించారు.

మొబైల్ ఫోన్‌ను ఎప్పటికప్పుడు భద్రంగా ఉంచుకోవాలని, బస్టాండ్లు, మార్కెట్లు, షాపింగ్ ప్రాంతాలు, బస్సు ప్రయాణాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని ఎస్పీ సూచించారు. మొబైల్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. బిల్లు లేదా సరైన పత్రాలు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయరాదని హెచ్చరించారు.

వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, కుటుంబ ఫోటోలు వంటి విలువైన డేటా రక్షణ కోసం మొబైల్ పోయిన వెంటనే ఫోన్‌ను బ్లాక్ చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ విషయంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే ఆర్థిక నష్టం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇంటి దొంగతనాల నివారణకు Lock House Monitoring System (LHMS) యాప్ వినియోగంపై కూడా ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పండుగలు లేదా ఇతర అవసరాల కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే వారు LHMS యాప్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కనీసం ఒక రోజు ముందుగానే యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందితే, పోలీసు సిబ్బంది ఇంటి వద్ద సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేస్తారని వివరించారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో కెమెరా ముందు ఏదైనా కదలిక జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలారం చేరుతుందని, ఆ సమాచారం అందిన వెంటనే సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందాలు అప్రమత్తమై మూడు నుంచి నాలుగు నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటారని ఎస్పీ తెలిపారు. దీంతో ఇంటి దొంగతనాలను సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సేవ కోసం ప్రజలు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదని, LHMS యాప్ ద్వారా సమాచారం ఇవ్వడమే సరిపోతుందని స్పష్టం చేశారు.

రికవరీ చేసిన మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన 141 మంది బాధితులు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, సైబర్ క్రైమ్ విభాగం, క్యాట్ టీం పోలీస్ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీలో విశేష కృషి చేసిన ఐటీ కోర్–సైబర్ క్రైమ్ క్యాట్ టీం విభాగం, సీఐలు గోపీనాథ్ రెడ్డి, సతీష్ కుమార్, పోలీస్ సిబ్బంది చంద్ర, శ్రీనివాసులు, షమీర్, సీసీఎస్ సిబ్బంది కృష్ణానాయక్, నరసింహమూర్తి తదితరులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, సైబర్ క్రైమ్ సీఐ గోపీనాథ్ రెడ్డి, క్యాట్ టీం, సోషల్ మీడియా సిబ్బంది, మొబైల్ ఫోన్లు పొందిన బాధితులు పాల్గొన్నారు.