ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన లోకేశ్..

అనంతరం తిరుపతిలోని భూపాల్ హౌసింగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కే. గౌతమి శ్వేత నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, కే. గౌతమి శ్వేతలను మంత్రి లోకేశ్ ఆశీర్వదించారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతలు ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు.

మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహానికి ముందు జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. పలువురు టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతుల జీవితంలో ఈ శుభ ఘట్టం చిరస్మరణీయంగా నిలవాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ఈరోజు (గురువారం) రాత్రి తిరుమలలోని శృంగేరీ శారద పీఠంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.