రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి: యువత భవిష్యత్తును కాపాడేందుకు, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ విస్తృత చర్యలు కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణా మరియు సరఫరాను అరికట్టడం, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా, తనిఖీలు, పరీక్షలు మరియు అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ చర్యలలో భాగంగా “డ్రగ్స్‌పై దండయాత్ర 2.0” పేరుతో జిల్లావ్యాప్తంగా మాదకద్రవ్యాలపై దాడులు, తనిఖీలు జరుగుతున్నాయి.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పరిధిలోని వివిధ సబ్ డివిజన్లలో సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో “మెగా గంజాయి టెస్టింగ్” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనుమానిత ప్రాంతాలు, పరిశ్రమలు, కార్మికుల సమూహాలు మరియు ఇతర గుర్తించిన ప్రాంతాల్లో బయో-చెక్ టెస్ట్ కిట్ల ద్వారా గంజాయి వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని గాజులమాండ్యం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న POCL కంపెనీలో ప్రత్యేక గంజాయి పరీక్షలు నిర్వహించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, గాజులమాండ్యం పోలీసుల పర్యవేక్షణలో సుమారు 136 మంది కార్మికులకు బయో-చెక్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా, ఎవరూ పాజిటివ్‌గా గుర్తింపు కాలేదు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి నివారించడం, ముఖ్యంగా కార్మికులు మరియు యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడం, పరిశ్రమల పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగానికి అవకాశం లేకుండా చేయడం లక్ష్యంగా ఈ ప్రత్యేక పరీక్షలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
గంజాయి వినియోగాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా, దాని వెనుక ఉన్న సరఫరా వ్యవస్థను ఛేదించడంపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా నమోదైన వ్యక్తులు, విక్రేతలు, సరఫరాదారులు మరియు వినియోగదారుల వివరాలను సేకరించి, వారి కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవగాహన కార్యక్రమాల ద్వారా యువతలో మాదకద్రవ్యాల ప్రమాదాలపై చైతన్యం కల్పించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోంది.













