రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైఎస్సార్ జిల్లాలో కేసీ కాలువ (కర్నూలు - కడప) లైనింగ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆయకట్టు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుమారు నాలుగేళ్లుగా కాలువ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుండటంతో పంటలకు సమయానికి నీరందక, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. జలవనరుల శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆధునికీకరణ పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పెద్దముడియం మండలంలోని సుద్దపల్లె వద్ద ప్రారంభమై ఉప్పలూరు వద్ద ముగిసే ఈ 15 కిలోమీటర్ల ప్రధాన కాలువ ద్వారా సుమారు 10,066.63 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. సుద్దపల్లె, జంగాలపల్లె, జె.కొట్టాలపల్లె, ఉప్పలూరు, బలపనగూడూరు, పెద్దముడియం గ్రామాల రైతులకు ఈ కాలువే ప్రధాన ఆధారం. కాలువ ద్వారా నీటి సరఫరా సక్రమంగా లేకపోతే ఈ ప్రాంతంలో పంటల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ప్రధానంగా జంగాలపల్లె - పెద్దముడియం మధ్య కాలువ అంచులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. లైనింగ్ ఊడిపోవడంతో కాలువ పక్కల మట్టి జారిపడటం, గోడలు కూలిపోవడం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. కాలువకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు దట్టంగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఫలితంగా నీటి ఒత్తిడి తగ్గిపోవడంతో దిగువ ప్రాంతాల వరకు నీరు సరిగా చేరడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కాలువ మరమ్మతులకు సంబంధించి మొత్తం 86 పనులను గుర్తించినట్లు సమాచారం. ఒక్కో పనికి సుమారు రూ.10 లక్షల చొప్పున వ్యయం అవసరమని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేసి, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపినట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమోదం, నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతుండటంతో పనులు ప్రారంభం కాకపోవడం రైతుల్లో ఆగ్రహానికి దారితీస్తోంది.
వర్షాకాలం ప్రారంభం కాకముందే యుద్ధప్రాతిపదికన కాలువ ఆధునికీకరణ, మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఖరీఫ్ సీజన్ నాటికి కాలువను పూర్తిగా శుభ్రపరచి, లైనింగ్ పునరుద్ధరించి, సాగునీరు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, జలవనరుల శాఖను విజ్ఞప్తి చేస్తున్నారు. కాలువ పరిస్థితిపై అధికారుల బృందం ప్రత్యక్షంగా పరిశీలించి, తక్షణ చర్యలు చేపట్టాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.













