రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో సాంకేతికతను ఆయుధంగా చేసుకున్న కొత్త తరహా ఆన్‌లైన్ మోసాలు కలకలం రేపుతున్నాయి. ఉచితంగా విలాసాలు అనుభవించాలనే ఆశతో కొందరు యువకులు దారి తప్పి, నకిలీ PhonePe యాప్‌లను వినియోగిస్తూ వ్యాపారులను మోసం చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమాయక వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ప్రతిరోజూ వేలాది రూపాయలు దోచుకుంటున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
మోసం పద్ధతి ఇలా ఉంటుంది. కేటుగాళ్లు అసలు PhonePe స్థానంలో దానికి సరిగ్గా పోలిక ఉండే నకిలీ యాప్‌లను తమ సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటారు. తర్వాత రద్దీ ప్రదేశాలను టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా మద్యం దుకాణాలు, బార్లు, రద్దీగా ఉండే రెస్టారెంట్లు, చిన్నచిన్న చిల్లర అంగడులను ఎంచుకుంటారు. అక్కడ గుమస్తాలు లేదా యజమానులు రద్దీ కారణంగా లావాదేవీలను వేగంగా పూర్తి చేయడంలో నిమగ్నమై ఉండటాన్ని వీరు అవకాశంగా మలుచుకుంటారు.
చెల్లింపు పూర్తయినట్లు నకిలీ స్క్రీన్‌ను చూపించడం వీరి ప్రధాన ఆయుధం. యాప్‌లో చెల్లింపు విజయవంతమైందని చూపించే నకిలీ స్క్రీన్‌ను చూపడమే కాకుండా, అనుమానం రాకుండా ఉండేందుకు హిస్టరీని కూడా నకిలీగా సృష్టిస్తారు. అంతేకాకుండా తమ యాప్ ఖాతాలో రూ.2 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించి వ్యాపారులను నమ్మేలా చేస్తారు. అంత డబ్బు ఉన్న కుర్రాడు మోసం చేయడులేడు, సర్వర్ సమస్య వల్ల మెసేజ్ ఆలస్యంగా వస్తుందేమో అని వ్యాపారులు భావించేలా భ్రమ కలిగిస్తారు.
సౌండ్ బాక్స్ లేదా పేమెంట్ అలర్ట్ బాక్సులు లేని చోట ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి చోట్ల చెల్లింపు నోటిఫికేషన్ ధ్వని రాకపోవడంతో, కేవలం కస్టమర్ ఫోన్‌లో కనిపించే స్క్రీన్‌పైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ తరహా కొత్త ట్రెండ్ మోసాలకు చెక్ పెట్టడం పోలీసు యంత్రాంగానికి కష్టమైన పని కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో, వాహన తనిఖీల సమయంలో పోలీసులు కొన్ని అంశాలపై దృష్టి సారిస్తే ఈ కేటుగాళ్లను సులభంగా గుర్తించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాత్రివేళ వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ లైసెన్స్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్లే యువకుల ఫోన్లను కూడా పరిశీలించాలని సూచనలు వినిపిస్తున్నాయి. వారి ఫోన్లలో ఉన్న PhonePe యాప్ అసలైనదో, నకిలీదో గుర్తించేందుకు యాప్ లోగో, రంగులు, ఐకాన్ నిర్మాణం వంటి అంశాలను గమనించాలని సూచిస్తున్నారు. అసలైన PhonePe లోగోకు, నకిలీ యాప్‌లకు గ్రీన్, బ్లూ, రెడ్ షేడ్స్‌లో, ఐకాన్ రూపంలో తేడాలు ఉంటాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
సందేహాస్పదంగా కనిపించే సందర్భాల్లో వారి ఫోన్‌లోని PhonePe యాప్‌ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ దందా గుట్టు రట్టు చేయవచ్చని భావిస్తున్నారు.
వ్యాపారులు, గుమస్తాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
PhonePe లేదా Paytm ద్వారా డబ్బులు పంపినప్పుడు మీ మొబైల్ లేదా సౌండ్ బాక్స్ నుండి నోటిఫికేషన్ సౌండ్ తప్పనిసరిగా రావాలని, సౌండ్ రాకపోతే లావాదేవీ పూర్తైందని భావించకూడదని నిపుణులు చెబుతున్నారు. అవతలి వ్యక్తి తన ఫోన్‌లో ‘success’ అని చూపించినంత మాత్రాన, లేదా బ్యాంకు బ్యాలెన్స్ చూపించినంత మాత్రాన నమ్మకూడదని సూచిస్తున్నారు.
లావాదేవీపై ఏమాత్రం అనుమానం వచ్చినా, “సౌండ్ రాలేదు, మీరు మీ యాప్ నుండి మళ్లీ ఒక రూపాయి పంపండి, చూద్దాం” అని చెప్పి పరీక్షించాలనే సూచన వస్తోంది. నకిలీ యాప్ అయితే ఆ క్షణంలోనే వారి అసలు రూపం బయటపడే అవకాశం ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ల పేరుతో జరుగుతున్న ఈ సైబర్ మాయాజాలం పట్ల వ్యాపారులు జాగరూకులై ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.













