రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: తెలుగు సాహిత్య ప్రపంచంలో మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల స్థానము అపూర్వమని ప్రొద్దుటూరు ఉప విద్యాధికారి శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఉదయం శివాలయం సర్కిల్లో ఏర్పాటు చేసిన పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పుట్టపర్తి సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టపర్తి 36వ వర్ధంతి కార్యక్రమంలో శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా సేవలందించడమే కాకుండా, అక్కడే ఉన్న సమయంలో శివతాండవం వంటి మహాకావ్యాన్ని సృష్టించడం ప్రొద్దుటూరుకు గర్వకారణమని ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా పుట్టపర్తి సాహితీ పీఠం ప్రధాన కార్యదర్శి జింకా సుబ్రమణ్యం పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ఆయన ఒక కారణజన్ముడని, చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన మహామేధావి అని వివరించారు. 12 ఏళ్ల వయసులోనే పెనుగొండ కావ్యాన్ని రచించిన పుట్టపర్తి, తన అసామాన్య ప్రతిభతో తెలుగు సాహిత్యానికి 150కి పైగా కావ్యాలను అందించారని తెలిపారు.
జింకా సుబ్రమణ్యం మాట్లాడుతూ పుట్టపర్తి నారాయణాచార్యులు 14 భాషలలో విశేష పాండిత్యాన్ని కనబరిచిన బహుభాషా వేత్తగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన సాహిత్య సంపదను కొత్త తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో గత 36 సంవత్సరాలుగా పుట్టపర్తి సాహితీ పీఠం ద్వారా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో కొత్తపల్లి శీను, కాశీవరకు వెంకటసుబ్బయ్య, బాలగంగాధర్ తిలక్, కాలే దేవానంద్, విద్యార్థి భాస్కర్, ఉదయగిరి శివరాం తదితరులు పాల్గొన్నారు. సభ ముగింపులో ముఖ్య అతిథి శివప్రసాద్‌ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.













