రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వాణిజ్యపరంగా కీలకమైన ప్రొద్దుటూరు పట్టణం, పరిసర గ్రామాల సమగ్ర అభివృద్ధికి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యంపై ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం సాయంత్రం కడప కలెక్టరేట్‌లో ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, జేసీ డా. నిధీమీనా, వివిధ శాఖల జిల్లాస్థాయి, డివిజనల్, నియోజకవర్గ స్థాయి అధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు పట్టణాన్ని పరిసర గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించే రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటు పూర్తిస్థాయిలో ఉండేలా చూడాలని సూచించారు. పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
ప్రొద్దుటూరులో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మురుగునీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సుమారు రూ.600 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, 24 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. కొత్తపల్లె ప్రాంతంలో శుద్ధి కేంద్రం కోసం అవసరమైన భూమి గుర్తింపును వేగవంతం చేసి, సంబంధిత శాఖల అనుమతులు త్వరగా పొందాలని ఆదేశించారు.
పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపాలిటీ యంత్రాంగం మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పారిశుధ్య కార్మికుల హాజరుకు ఎఫ్.ఆర్.ఎస్. విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసి, వారికి చెల్లించే ప్రతి చెల్లింపును కూడా ఎఫ్.ఆర్.ఎస్. నమోదు ఆధారంగానే జరపాలని ఆదేశించారు.
పట్టణ విస్తరణ, కొత్త నిర్మాణాలు, లేఅవుట్ల అభివృద్ధి నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించి, లేఅవుట్ల అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు, రహదారుల ఏర్పాటు, ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన స్థలాలు, పార్కులు, మౌలిక వసతుల కల్పన, పట్టణ ప్రణాళిక నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రొద్దుటూరులో గతంలో పేదలకు మంజూరైన ప్రభుత్వ గృహాల నిర్మాణంలో ఆప్షన్–1, 2 నిర్మాణాల ఎంపిక, ఆప్షన్–3 కేటాయింపుల్లో కాంట్రాక్టర్ల వ్యవహారంపై వచ్చిన అవకతవకల ఆరోపణలను కలెక్టర్ ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని, హౌసింగ్ శాఖ, ప్రైవేటు ఏజెన్సీలపై వచ్చిన ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించాలని ఆదేశించారు. అదే సమయంలో నూతన గృహ నిర్మాణ విధానం ప్రకారం ఇప్పటివరకు ఇళ్లు మంజూరు కాని అర్హులందరిని గుర్తించి ఇంటి పట్టాలు, గృహ నిర్మాణ సదుపాయాలు కల్పించాలని, అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సూచించారు.
మైలవరం జలాశయం నుంచి ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సరఫరా, నిల్వ కేంద్రాలు, పంపిణీ పైపులైన్ల పరిస్థితిని కూడా కలెక్టర్ సమీక్షించారు. అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పథకాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు భవిష్యత్ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. చౌడూరు వద్ద ఏర్పాటు చేస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులో ఖాళీగా ఉన్న స్థలాలను పారిశ్రామికవేత్తలకు కేటాయించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా పరిశ్రమలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల గ్రామాల్లో రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణంతో అనుసంధానించే రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, అనుమతులు, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు సలహాలు, సూచనలను సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో రహదారులు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరారు. పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి పట్టణ–గ్రామీణ అనుసంధాన రహదారుల అభివృద్ధి, పేదల గృహ నిర్మాణం, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో శిరీష, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్, తహశీల్దార్ ఉదయ్ భాస్కర్, టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణసింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.













