రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మెగా-జనసేన కార్యకర్తలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానికంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక విద్యార్థి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ శరణాలయంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రామోజీ ప్రసాద్, రామారావు సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. శరణాలయానికి చేరుకున్న వారు చిన్నారులతో సమయం గడుపుతూ స్వయంగా భోజనాన్ని వడ్డించారు.
పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడిగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా సేవలో చిరకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన ఆరోగ్యం, రాజకీయ ప్రస్థానం మరింత బలపడాలని కోరుకున్నారు.
ఈ సేవా కార్యక్రమంలో తాళ్లమాపురం మంచి శివ, మధు చిరు రాయల్, శివ అశోక్, కేశవ, సుబ్బరాయుడు, రాము తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘పవర్ స్టార్’గా విశేష అభిమాన గణం, ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం 2014లో ‘జనసేన పార్టీ’ని స్థాపించారు. ప్రశ్నించే స్వరంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ 11వ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ-అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సినీ రంగంలో రికార్డులు సృష్టించిన నాయకుడిగా, రాజకీయాల్లో సేవా దృక్పథాన్ని చాటుతున్న ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం స్థానికంగా పలువురి ప్రశంసలు అందుకుంది. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన వేడుకలను నిర్వహించడం మంచి ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.













