రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చౌడూరు గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక స్వర్ణ గ్రామం కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన రైతులకు ఆయన స్వయంగా పాస్ పుస్తకాలను అందజేశారు.
చౌడూరు గ్రామంలో మొత్తం 923 మంది పట్టాదారులు ఉన్నారని, రీ-సర్వే విజయవంతంగా పూర్తయిన 876 మంది రైతులకు మొదటి విడతలో పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా, పూర్తిగా పారదర్శకంగా కేవలం ప్రభుత్వ అధికారిక రాజముద్రతోనే ఈ పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో రైతుల భూమి హక్కు పత్రాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు ముద్రించి రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని వరదరాజుల రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానానికి స్వస్తి పలికి, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా కేవలం రాజముద్రతోనే పత్రాలను అందించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో కూటమి పాలనలో చౌడూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగిస్తామని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వరదరాజుల రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన్, ఆర్ఐ నాగమోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఇన్‌ఛార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్, టీడీపీ ముఖ్య నేతలు రవికుమార్ రెడ్డి, శంకరాపురం మారుతి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.













