రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప ఆధ్వర్యంలో రాబోయే జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై న్యాయ, పోలీసు విభాగాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నూతన ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవ శ్రీ జి.రామ గోపాల్ అధ్యక్షత వహించారు.
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు ఎ.యస్.పి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల డి.యస్.పి లు పాల్గొన్నారు. న్యాయ సేవ సేదన్‌లో జరిగిన ఈ సమావేశానికి ముందు నూతన ప్రధాన జిల్లా న్యాయమూర్తికి పుష్ప మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
సమావేశంలో 12-09-2026న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి అనుకూలమైన కేసులపై విస్తృతంగా చర్చించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ ద్వారా పరిష్కారం కావడానికి ప్రతి విభాగం సమన్వయంతో కృషి చేయాలని గౌరవ జి.రామ గోపాల్ సూచించినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా W.P.No.116/2024, తేదీ: 26-11-2025 ప్రకారం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను రాబోయే జాతీయ లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలియజేశారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం సంబంధిత జురిస్డిక్షన్‌లో ఏర్పాటు చేయబడే జాతీయ లోక్ అదాలత్ బెంచ్‌ల ముందు హాజరై, పెండింగ్ ట్రాఫిక్ చలానాలను కాంపౌండ్ చేసుకోవచ్చని సమావేశంలో వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు సూచించారు.
జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు పోలీసు, న్యాయ విభాగాలు సమన్వయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్.బాబా ఫక్రుద్దీన్, ఉమ్మడి కడప జిల్లా ఎ.యస్.పి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల డి.యస్.పి లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.













