రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: పట్టణంలో అక్రమ మట్కా జూదంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పెన్నానగర్‌కు చెందిన నలుగురు మట్కా బీటర్లను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఎస్సై వివరాల ప్రకారం, షేక్ ఖాదీర్, దూదేకుల దస్తగిరి, దేవరగుంట్ల దస్తగిరి, కాకర్ల దస్తగిరి అనే నలుగురు LIC ఆఫీస్ సమీపంలో మట్కా రాస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అక్కడ నుంచి మట్కా చీటీలు, రూ. 9 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ జూద కార్యకలాపాలపై పహారా పెంచిన నేపథ్యంలో ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలో మట్కా, ఇతర రకాల జూదాలకు ఆస్కారం లేకుండా చర్యలు కొనసాగిస్తామని 1 టౌన్ పోలీసులు స్పష్టం చేశారు.
మట్కా బీటర్లతో పాటు మట్కా ఆడేవారిపైనా కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. జూద కార్యకలాపాల్లో పాల్గొనే వారు చట్టపరమైన పరిణామాలను గుర్తుంచుకోవాలని, ఇలాంటి అక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రొద్దుటూరు పట్టణంలో ఇటీవలి కాలంలో మట్కా కార్యకలాపాలు పెరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో పోలీసులు గూఢచారి వ్యవస్థను బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.













