రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు పశువైద్యశాలలో ఒప్పంద పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్న సి. వెంకట సురేశ్ (48) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకున్న ఆయనను కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మైదుకూరు పశువైద్యశాలలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిలో ఒకరితో సురేశ్ నాలుగు రోజుల క్రితం అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ విషయంపై బాధిత మహిళ తన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు నేపథ్యంలో అధికారుల స్థాయిలో విచారణ ప్రారంభమైనట్టు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన సురేశ్ మంగళవారం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, ఆసుపత్రి సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.
ఘటనపై మైదుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావడానికి దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.













