రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైఎస్సార్ కడప జిల్లా విద్యా రంగానికి చెందిన భౌతికశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి పరిశోధనలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ జిల్లాకు కీర్తిని తీసుకువస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలో పనిచేస్తూనే ప్రపంచ స్థాయి పరిశోధనలు కొనసాగిస్తూ భౌతిక శాస్త్ర రంగంలో రాణిస్తున్నారు. కడప ఆర్ట్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో భౌతికశాస్త్ర సీనియర్ అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు.
సుధాకర్‌రెడ్డి రూపొందించిన పరిశోధన పత్రాలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఎస్‌సీఐ, ఎస్‌సీవోపీయూఎస్ జర్నల్స్‌లో 75కు పైగా ప్రచురితమయ్యాయి. అదనంగా ఒక పాఠ్య పుస్తకం, నాలుగు పుస్తక అధ్యాయాలను ప్రచురించారు. విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ నిధులతో దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసే అవకాశం పొందారు.
చింతకొమ్మదిన్నె మండలం గూడువాండ్లపల్లెకు చెందిన సుధాకర్‌రెడ్డి పేద కుటుంబంలో జన్మించారు. డిగ్రీ వరకు విద్యను జిల్లాలోనే అభ్యసించారు. అనంతరం తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సీ భౌతికశాస్త్రం, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేశారు. తాను డిగ్రీ పూర్తి చేసిన కడప నగరంలోని శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలోనే భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా నియమితులవడం ఆయన విద్యా ప్రయాణంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.
భౌతికశాస్త్రంలో ‘సాలిడ్ స్టేట్ స్పెక్ట్రోస్కోపీ, రేర్ ఎర్త్ అయాన్లు, లూమినసెంట్ మెటీరియల్స్’పై ఆయన పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ సాంకేతికతలే ఆధునిక ఎల్‌ఈడీలు, లేజర్‌లు, టెలీ కమ్యూనికేషన్ రంగాలకు శక్తినిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.
సుధాకర్‌రెడ్డి ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో 120కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. కన్వీనర్‌గా నాలుగు జాతీయ సదస్సులను నిర్వహించారు. తొమ్మిది మంది పీహెచ్‌డీ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఆయనకు గతంలో బోధించిన గురువులే ఉండటం విశేషం.
యూజీసీ, సీఎస్‌ఐఆర్, ఆర్‌యూఎస్‌ఏ నిధులతో రూ.63 లక్షల విలువైన నాలుగు ప్రధాన పరిశోధన ప్రాజెక్టులు, రెండు చిన్న పరిశోధన ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. దక్షిణ కొరియాలోని గ్వాంగ్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (జీఐఎస్‌టీ)లో ప్రతిష్ఠాత్మక పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పొందారు.
రేర్ ఎర్త్ అయాన్లు డోప్ చేసిన గ్లాసులు, పౌడర్లపై వివిధ అంతర్జాతీయ సమావేశాలలో ఉపన్యాసాలు ఇచ్చి తన పరిశోధనల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుతున్నారు. ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో పనిచేస్తూనే ఇలాంటి అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేయడం ద్వారా జిల్లా విద్యా రంగానికి సుధాకర్‌రెడ్డి స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలుస్తున్నారు.













