కడప జిల్లా కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు లో రైతులు నిరసన తెలిపారు. కడప జిల్లా రైతు సేవా సమితి ఆధ్వర్యంలో మైదుకూరు లోని KC Canal డివిజనల్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

రైతులతో కలిసి నిర్వహించిన ఈ నిరసన అనంతరం డివిజనల్ ఇంజనీర్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశామని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ తెలిపారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు ఆరుతడి పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నప్పటికీ, సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

రమణ పేర్కొన్న వివరాల ప్రకారం, శ్రీశైలం డ్యాం లో ప్రస్తుతం సుమారు 800 అడుగుల నీటి మట్టం ఉన్న నేపథ్యంలో వరి పంటకు నీరు ఇవ్వకపోయినా, కనీసం ఆయకట్టు పరిధిలోని ఆరుతడి పంటలకు మాత్రం నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ పొలాలే ఆయకట్టు రైతులకు ప్రధాన ఉపాధి మార్గమని, నీరు అందకపోతే తీవ్ర నష్టాలు తప్పవని సమితి నాయకులు అభిప్రాయపడ్డారు.

కేసీ కెనాల్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యపై వెంటనే స్పందించి, ఆయకట్టు రైతులకు అవసరమైన నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని సమితి డిమాండ్ చేసింది. రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని సమితి నాయకులు గుర్తుచేశారు.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోకపోతే, రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఏవి. రమణ హెచ్చరించారు. రైతుల హక్కుల కోసం రైతు సేవా సమితి కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేసినట్టు సమితి వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడిశెట్టి సహదేవుడు, సమితి మైదుకూరు పట్టణ నాయకుడు రామ్మోహన్, సుబ్బరాయుడు, గోసెట్టి రమణయ్య, యల్లల రామచంద్రుడు, ములపాకు నాగేశ్వరరెడ్డి, రాయని రామకృష్ణ, గురువిరెడ్డి, శివ నాగిరెడ్డి, చెన్నారెడ్డి, ముత్తులూరుపాడు శీను తదితరులు, పలువురు రైతులు పాల్గొన్నారు.