రాయలసీమ వాసులు దశాబ్దాలుగా కలలు కంటున్న ఉక్కు పరిశ్రమ కల ఎట్టకేలకు సాకారమవుతోంది. ఈ ప్రాంత పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త అధ్యాయానికి ముఖ్యమంత్రి  చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభించారు.

1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది. జిందాల్ సంస్థ మొదటి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కర్మాగారంలో అత్యాధునిక ఎలక్ట్రిక్‌ ఆర్క్‌ ఫర్నేస్‌(ఈఏఎఫ్‌) సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఫలితంగా పర్యావరణానికి ముప్పుగా పరిణమించే కార్బన్‌ ఉద్గారాలు గణనీయంగా తగ్గి, పర్యావరణహిత గ్రీన్‌ స్టీల్‌ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ తరహా ప్లాంట్‌ దేశంలోనే మొదటిదిగా జేఎస్‌డబ్ల్యూ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.