రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: దివంగత ముఖ్యమంత్రి YSR 77వ జయంతి సందర్భంగా YSR కడప జిల్లాలోని ఇడుపులపాయ ఘాట్ వద్ద APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిలా రెడ్డి, YSR సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాహిత పాలనను గుర్తుచేశారు.
YSR కుటుంబం పెద్దదని, కోట్లాది ప్రజలను కలిగిన పెద్ద కుటుంబమని వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన మేలును ఈ రోజు వరకు ప్రజలు తలుచుకుంటున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిగా YSR పనిచేసిన కాలం ఐదేండ్లు మాత్రమే అయినా, ఆ ఐదేండ్లలో ఆయన అభివృద్ధి ప్రతి గడపకు చేరిందని ఆమె గుర్తుచేశారు.
YSR మరణించిన వెంటనే సుమారు ఏడు వందల మంది ఆయన వెనకాలే వెళ్లిపోయారని, ఇది ప్రజల ప్రేమాభిమానాలకు నిదర్శనమని వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల పక్షపాతిగా YSR నిలిచారని, ఆయన అమలు చేసిన పథకాలు లక్షలాది కుటుంబాల జీవితాలను మార్చాయని ఆమె వివరించారు.
ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాలు YSR మనసు పెట్టి రూపొందించిన సంక్షేమ కార్యక్రమాలని వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా పేద కుటుంబాల పిల్లల్లో ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని ఆమె తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం అనేక మంది జీవితాలను నిలబెట్టిందని ఆమె అన్నారు.
YSR ఒక లెజెండరీ లీడర్‌గా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ షర్మిలా రెడ్డి అభిప్రాయపడ్డారు. YSR కి మరణం లేదని, ఆయనను స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలందరికీ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతోందని ఆమె పేర్కొన్నారు.
YSR ను స్మరించుకుంటున్న కోట్లమంది తెలుగు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్తుంది













