రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంపై యువత ఉమ్మడిగా గళమెత్తుతోంది. ప్రొద్దుటూరు నుండి జమ్మలమడుగు వరకూ నేటి తరం యువతగా చెప్పుకునే Gen-Z భారీ నిరసనలకు తెరలేపింది. విద్యాశాఖ, ఐటీ శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటి వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా #LOKESHRESIGN అనే హాష్‌ట్యాగ్ విస్తృతంగా వినిపిస్తోంది.
నిరుద్యోగ యువత చేపట్టిన ఈ నిరసనల్లో ప్రభుత్వాన్ని మూడు ప్రధాన ప్రశ్నలతో నిలదీస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్లలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎందుకు సాగదీస్తున్నారని యువత ప్రశ్నిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పనపై చేసిన హామీలు ఏమయ్యాయో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
నోటిఫికేషన్లు లేక వయోపరిమితి దాటిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ భవిష్యత్తుతో ఎవరు ఆటలాడుతున్నారో ప్రజలకు తెలియజేయాలని, ఉద్యోగాల విషయంలో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగ యువత చేపట్టిన ఈ పోరాటానికి వైఎస్సార్‌సీపీ నేతలు అండగా నిలుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రొద్దుటూరు రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న రాచమల్లు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డితో కలిసి నిరుద్యోగ యువతకు తోడుగా ఉంటున్నారు.
“ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పోరాటం కాదు. లక్షలాది మంది యువతీ యువకుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానికి, మంత్రి లోకేష్‌కు బుద్ధి చెప్పే వరకు యువతకు తోడుగా ఉంటాం” అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరు వీధుల్లో యువత భారీ ర్యాలీలు నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ‘Gen-Z శక్తి – మార్పు ఖాయం!’ అనే నినాదాలతో నడుస్తున్న ఈ ర్యాలీల్లో విద్యావంతులైన యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విద్యావంతులైన యువతను రోడ్లపైకి తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ కల్పనపై స్పష్టమైన ప్రకటన చేయాలని యువత డిమాండ్ చేస్తోంది. తమ ప్రశ్నలకు సమాధానం రాకపోతే, నోటిఫికేషన్లపై స్పష్టత లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ Gen-Z నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.













