రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: ఎవరూ అడగని, బంధువులు లేని గుర్తు తెలియని వ్యక్తికి చివరి వీడ్కోలు పలికేందుకు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న ఈ వ్యక్తి, ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంలో అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం.
మరణించిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు లభించకపోవడంతో పాటు, అంతిమ సంస్కారాలకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానిక పోలీసు సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫౌండేషన్ ప్రతినిధులు స్పందించి అంత్యక్రియల ఏర్పాట్లు చేపట్టారు.
ఈరోజు ప్రొద్దుటూరులోని హిందూ స్మశాన వాటికలో, హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, సతీష్, రసూల్ పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.
సమాజంలో బంధువులు లేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చేపట్టిందని ఫౌండేషన్ వర్గాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం ఫౌండేషన్ లక్ష్యమని సభ్యులు పేర్కొన్నారు.
మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు, సేవాభావం కలిగిన వారు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్‌ను సంప్రదించాలని ఫౌండేషన్ సభ్యులు సూచించారు. సమాజంలో నిరుపేదలు, బంధువులు లేని వృద్ధులు, గుర్తు తెలియని వ్యక్తుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.













