పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపణ

రాష్ట్రంలో పోలీసులు తెలుగు దేశం పార్టీ అధినేత N. చంద్రబాబు నాయుడు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో జరిగిన లాకప్ మృతిపై ఆయన ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను నిలదీశారు.

సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్‌లు ఉన్నప్పటికీ, వాటి అమలులో పోలీసులు చట్టపరమైన విధానాలను పాటించలేదని రాచమల్లు ఆరోపించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని, తరువాత కృష్ణ లంక పోలీసులు కలిసి అతడిని హింసించి చంపినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఎక్కడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేయడం ద్వారా నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన విమర్శించారు.

జగ్గయ్యపేట లోని ఒక ల్యాండ్ డీల్ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితోనే ఈ లాకప్ డెత్ జరిగినదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సిటీ కమీషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తో పాటు మరికొందరు పోలీసులు కలిసి సాయికృష్ణను అత్యంత క్రూరంగా హింసించి చంపినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రజా సంఘాలు, వైఎస్సార్‌సీపీ కలిసి కుటుంబానికి మద్దతు తెలపడంతో CI నాగరాజు పై కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. అయితే ఒక్క అధికారిపై కేసు పెట్టడం సరిపోదని, ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణ మరణించిన సమయం, పరిస్థితుల గురించి స్పష్టమైన వివరాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలంటే కేసును సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాల్సిందేనని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు.