రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: పట్టణ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “ప్రజలతో కమిషనర్ తో ముఖాముఖి” పేరుతో ప్రతి సోమవారం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం 10.08.2026 సోమవారం నుండి అమల్లోకి రానుంది. ప్రతి సోమవారం ఉదయం 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు ఒక గంటపాటు ఈ ఫోన్ ఇన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయం అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం యథావిధిగా కొనసాగనుంది.
ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు తెలియజేయడానికి 9247563385, 9849905863 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈ ఫోన్ ఇన్ ద్వారా ప్రజలు మున్సిపాలిటీ సేవలను మరింత సులభంగా పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, అలాగే మున్సిపల్ కార్యాలయానికి రాలేని దూరాభార ప్రాంతాల ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనుబంధంగా ఈ ఫోన్ ఇన్ ద్వారా ‘టైం లైన్’ ప్రకారం సమస్యల పరిష్కారం వేగవంతం కానుందని మున్సిపాలిటీ అధికారులు పేర్కొన్నారు. అయితే, కేవలం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే సమస్యలనే ఈ కార్యక్రమంలో నమోదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఫోన్ చేసే బాధితులు తమ ఫిర్యాదును నమోదు చేయించుకునే సమయంలో ఫిర్యాదుదారుడి పేరు, పూర్తి చిరునామా, సెల్ లేదా ఫోన్ నంబర్, సమస్య యొక్క సంక్షిప్త వివరణను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా సంబంధిత శాఖలకు ఫిర్యాదులు పంపబడతాయి.
ఫోన్ ఇన్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు శానిటేషన్ సూపర్‌వైజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్, మెప్మా సెక్షన్ హెడ్, PGRS సిబ్బంది పాల్గొననున్నారు. ఫోన్ ద్వారా నమోదైన ఫిర్యాదులను అదే రోజు సంబంధిత శాఖాధికారులకు పంపి, ప్రతి సోమవారం కమిషనర్ స్వయంగా వీటి పురోగతిని పర్యవేక్షించనున్నట్లు మున్సిపాలిటీ వర్గాలు వెల్లడించాయి.
పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిబంధనల మేరకు తమ సమస్యలను నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ప్రజలను కోరారు.













