రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపూర్:- ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం వర్షపాతం తీవ్రంగా తగ్గిపోవడంతో రైతులు, పశుపోషకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో సుమారు 50 శాతం లోటు వర్షపాతం నమోదైనప్పటికీ, సూపర్ El Nino ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైందని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.
వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు మేత దొరకక రైతులు వాటిని సంతల్లో అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం నీటి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
జిల్లాకు కనీసం 16 TMCల నీరు కూడా కేటాయించలేదని, మరో 4–5 TMCల నీరు వచ్చే అవకాశం మాత్రమే ఉందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శ్రీశైలం డ్యాంలో నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో అక్కడ విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేసి ఆ నీటిని రాయలసీమ అవసరాలకు మళ్లించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాయలసీమకు మొత్తం 25 TMCల నీటిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పట్టిసీమ నీటిని వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని రైతులను బెదిరించడం సరికాదని, ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు.
జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ శాసనసభలో కరువు, సాగునీటి సమస్యలను ప్రస్తావించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. మార్చి వరకు తోడిన 53 TMCల నీరు ప్రస్తుతం ఏ చెరువుల్లో ఉందో ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
హార్టికల్చర్ హబ్ గురించి మాట్లాడటం కంటే, ప్రస్తుతం ఎండిపోతున్న పండ్ల తోటలు, ఆరుతడి పంటలను కాపాడటానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. పశుగ్రాసం పెంపొందించడానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని, పంటలు వేయలేని రైతులకు ఆర్థిక సహాయం అందించి వలసలను నివారించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా పేర్కొన్నారు.
పశుగ్రాసం పెంపొందించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి, పంటలు వేయని రైతులకు ఆర్థిక సహాయం అందించి వలసలను నివారించాలని అనంత వెంకటరామిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.













