రాయలసీమ న్యూస్, అనంతపురం: రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు-1, కనేకల్లు-2 పరిధిలో భారీ స్థాయిలో పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ప్రాంతంలో మొత్తం సుమారు 1000 మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రతిపాదనలలో భాగంగా మరో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న కొత్త పవన విద్యుత్ ప్రాజెక్టుకు ఈనెల 25న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ బాబు స్వయంగా హాజరై శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. దీంతో కనేకల్లు ప్రాంతం రాష్ట్రంలో పవన విద్యుత్ రంగంలో కీలక కేంద్రంగా అవతరించే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు.

కనేకల్లు-1, కనేకల్లు-2 ప్రాజెక్టులు టాటా పవర్, యాక్సిస్ ఎనర్జీస్, వ్యారిస్, సుజ్లాన్ సంస్థల భాగస్వామ్యంతో అమలు కానున్నాయి. ప్రముఖ సంస్థలు భాగస్వామ్యం కావడంతో ప్రాజెక్టుల అమలు వేగం, నాణ్యతపై విశ్వాసం పెరిగిందని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పవన విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమలు అయితే రాయదుర్గం నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, అనుబంధ సేవల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల పరంగా ఈ ప్రాజెక్టులు ఉపయోగకరంగా ఉండనున్నాయని భావిస్తున్నారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ బాబు చేస్తున్న కృషి అభినందనీయమని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. ఆయన స్వయంగా కనేకల్లుకు వచ్చి పవన విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం మన నియోజకవర్గానికి గర్వకారణంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ బాబు పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని స్థానిక నాయకత్వం కోరుతోంది. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రాంతీయ అభివృద్ధి, భవిష్యత్ పారిశ్రామిక ప్రణాళికలపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













